మండుటెండలోన మంచుపలకలట్లు*
తాటిముంజెలిట్టె తపన తీర్చు*
కల్పవృక్షమిదియె గ్రామీణ ప్రజలకు*
బలము రుచియు వైద్య ఫలము కూడ*
***నాగమంజరి గుమ్మా***
ఫలవిలాసం, 12/108 వ పద్యం
మంచి వేసవిలో దాహము తీర్చడానికి అన్నట్లు, చలువకు ఈ తాటి ముంజెలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాటిచెట్టు కల్పవృక్షం. తాటికాయ, ముంజెలు, పండు, ఆకులు (కమ్మలు), కాండము, టెంకలు అన్ని ఉపయోగకరమైనవే.
1. ఆకులను (కమ్మలు) విసనకర్రలుగా, మట్టి ఇండ్లకు పైకప్పుగా, ప్రాచీన కాలంలో రాతకు (తాళపత్రములు) , బుట్టలు, చాపలు, తాళ్ళు తయారీకి, గొడుగులకు ఉపయోగిస్తారు. ఆడపిల్లల బొమ్మల పెళ్ళిళ్ళకి, పందిళ్ళకు, గిలకలకు కూడా ఉపయోగిస్తారు. మధ్యలో ఉండే మువ్వ కమ్మ తో మందుగుండు సామాన్లు (కమ్మరేకు కాయలు/అగాదా కాయలు) చేస్తారు.
2. చెట్టు వద్దనే తాటికాయలు కొట్టి, ముంజెలు తినేవాళ్ళు కొందరు అయితే, ముంజెలు వొలిపించి తినేవారు కొందరు. పల్లెల్లో పిల్లలకు ఇవే ఆటవస్తువులు. ఒంటి కాయ బండి, రెండు కాయల బండ్లు...
3. ముదిరిన తాటికాయలు జూలై నెలాఖరుకు పండ్లు అవుతాయి. ఆ పండ్లరసం మహా ప్రీతిగా తింటారు. తాండ్ర తయారు చేస్తారు. తాటిబెల్లం తయారు చేస్తారు. ఇది ఔషధం. తాటిపండ్ల రసంలో వరిపిండి కలిపి బలవర్ధకమైన వంటకం తయారు చేస్తారు. రుచిగా ఉందని ఎక్కువగా తినకూడదు. కొద్దిగా మాత్రమే తినాలి.
4. తాటినార (తడపలు) తో తాళ్ళు తయారు చేస్తారు. తడపలతో వేసే ముళ్ళు చాలా గట్టిగా ఉంటాయి.
5. తాటిపండ్లు బాగా పండి, ఎండిన తర్వాత వాటిని విడగొట్టి తాటి టెంకలు (ముదిరి, ఎండిపోయిన తాటిముంజెలు) తీస్తారు. టెంకలు కత్తితో చీల్చి తాటి గుజ్జు తీస్తారు. నాగులచవితి నాడు ప్రత్యేకంగా ఈ గుజ్జును పాముకు నివేదిస్తారు. మహా రుచిగా ఉంటుంది.
6. విరవని తాటిటెంకలు భూమిలో పాతిపెడతారు. మార్గశిర మాసానికల్లా తేగలు/తీగలు వస్తాయి. నిప్పులపై కాల్చి/ ఉడకబెట్టి తింటారు. మంచి బలవర్ధకమైన ఆహారం. పీచు పదార్థం కాబట్టి సుఖ విరేచనం అవుతుంది.
7. కాండము నీటి బోదెలుగా, ఒకప్పటి పెంకుటిండ్లకు వాసాలుగా, వంట చెరకుగా ఉపయోగపడతాయి.
Comments
Post a Comment