ఫలవిలాసం 13/108 వ పద్యం

నారికేళ ఫలము వారికిన్నెలవగు*
శ్రీఫలమను పేర సిరులనొసగు*
దేవతలకు తగిన నైవేద్యఫలమగు*
పెంచు వారి కిచ్చు పెక్కు ఫలము*

***నాగమంజరి గుమ్మా***
*ఫలవిలాసం 13/108 వ పద్యం*

కొబ్బరికాయ గురించిన పొడుపుకథ తెలియని వారు ఉండరు. కొబ్బరి ఉపయోగాలు తెలియని వారు అసలే లేరు. దైవకార్యాలు, శుభకార్యాలు కొబ్బరికాయ, కొబ్బరిబొండం లేనిదే పూర్తి కావు. కొబ్బరి నీరు దాహం తీరుస్తుందని, పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి వంటలలో ఉపయోగిస్తారని, కొబ్బరి పీచుతో తాళ్ళు ఇతర గృహోపకరణ సామగ్రి తయారు చేస్తారని, ఆకులు శుభకార్యాలకు, బుట్టలు, చాపలు వంటి వస్తువుల తయారీకి ఉపయోగిస్తారని, కొబ్బరి నూనె శిరోజాలు పెరగడానికి, దీపారాధనకు ఉపయోగిస్తారని  అందరికి తెలిసిందే. 

ఇంక మిగిలిన విషయాలు చూద్దాం.

 కొబ్బరినీటిలో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల మూత్ర విసర్జన తక్కువగా జరుగుతున్నప్పుడు, జలోదరానికీ(మూత్రం బంధించి పొట్ట ఉబ్బిపోయినపుడు), మూత్ర విసర్జన ధారాళంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను తాగిస్తే ఫలితం ఉంటుంది.  అతిసారం, చీము రక్తం విరేచనాలు అధికంగా ఉన్నప్పుడు, హైపర్ అసిడిటి ఉన్నప్పుడు, వాంతులు, తల తిరగడం, డీహైడ్రేషన్ లకు కొబ్బరినీరు దివ్యౌషధం. శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయడమే కాకుండా శరీరంలో ఉన్న విష పదార్ధాలను మూత్రం ద్వారా బయటకు గెంటేస్తుంది. 

కొబ్బరి నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు

కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .

 కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందట.అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే) ప్రతీ సంవత్సరము సెప్టెంబరు రెండు న జరుపుతారు .

కొబ్బరి నూనెలో విటమిన్ 'ఇ ' అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిది. థైరాయిడ్ సమస్యలూ ఉండవు. పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తింటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. మేను ప్రకాశవంతముగా మెరుస్తుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి పాలు తలకు పట్టిస్తే, కేశాలు కాంతి వంతముగా తయారౌతాయి.
కొబ్బరి నూనె పొడి చర్మంతో సహాయం, ఒక చర్మం మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు. 

కేరళ వంటకాలలో కొబ్బరి, కొబ్బరి నూనె వాడకం ఎక్కువ. పెళ్లిలో వధూవరులు తలంబ్రాలు పోసుకునేటపుడు ఎండుకొబ్బరి (కురిడి) చేతులలో ఉంచి, బియ్యం, పాలు పోసి తలపై పోయిస్తారు. 

పద్యం, భావం కఠినమైన రచనను *నారికేళ పాకం* గా పిలుస్తారు. అంత సులువుగా కొబ్బరి నీరు, ముక్క లభించవుగా...

Comments